సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే యాగాలు చేస్తుంటారని ఎందుకు చేస్తున్నారో తమకు తెలుసునంటూ సెటైర్లు వేశారు. 

కేసీఆర్ చేసే యాగాలు లోక కళ్యాణం కోసం కాదని తన కుమారుడు కోసమేనంటూ పంచ్ లు వేశారు. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వార్థంతో యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారే తప్ప ప్రజల మేలు కోసం కాదన్నారు. 

టీఆర్ఎస్ పార్టీలో బాహుబలి ఉన్నారంటూ కేసీఆర్ పదేపదే చెప్తున్నారని అక్కడ బాహుబలి ఉంటే బీజేపీలో మోదీ బ్రహ్మాస్త్రం ఉందంటూ హెచ్చరించారు. ఎంతమంది బాహుబలిలు ఉన్నా తమ బ్రహ్మాస్త్రం ముందు దిగదుడుపేనన్నారు. 

టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ తన చేతిలోనే ఉందని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటూ ఉంటుంటే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. 

గత ఎన్నికల్లో సైతం మజ్లిస్ పార్టీ బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా కనీసం కేసీఆర్ ఖండించలేదని గుర్తు చేశారు. మజ్లిస్ పార్టీ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. 

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన డా.కె.లక్ష్మణ్  ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు. 

టీఆర్‌ఎస్‌ యూటీ, బీటీ బ్యాచ్‌గా చీలిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రోజురోజుకూ రాజుకుంటుందన్నారు. అది ఏ సమయంలోనైనా బయటపడొచ్చని చెప్పుకొచ్చారు. 

దేశంలో రోజురోజుకూ ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్‌ పెరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పుకొచ్చారు. కృష్ణార్జునుల మాదిరిగా మోదీ, అమిత్‌షాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారంటూ డా.కె.లక్ష్మణ్ కొనియాడారు. 

యాదాద్రికి సీఎం కేసీఆర్: ఆలయంలో ప్రత్యేక పూజలు.