తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించిన జనగామ లాఠీచార్జ్ ఘటనపై పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి వెస్ట్‌ జోన్ డీసీపీ ప్రమోద్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

నివేదిక అనంతరం దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కాగా, జనగామ బీజేపీ ఇన్‌చార్జ్ పవన్‌శర్మపై పోలీసుల లాఠీచార్జ్ చేశారు. దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. 24 గంటల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Also Read:తెలంగాణ పోలీసులకు అది ఫ్యాషన్ అయింది.. ఎమ్మెల్యే రఘునందన్ రావు..

వివేకానందుని జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ చౌరస్తా నుంచి స్థానిక నెహ్రూ పార్కు వరకు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్‌ ఆదేశాల మేరకు సిబ్బంది వాటిని తొలగించారు.

దీనిపై ఆగ్రహించిన కాషాయ నాయకులు  మున్సిపల్ కమిషనర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కార్యకర్తలను కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు.