హైదరాబాద్ : ఓఎల్‌ఎక్స్‌ లో స్మార్ట్‌ ఫోన్లు సేల్ పెడితే ఆమె వెంటనే స్పందిస్తుంది. ఆ ఫోన్ ను తాను కొనుగోలు చేస్తానంటూ నైస్ గా మాట్లాడుతుంది. తాను చెప్పిన చోటికి పిలిపించుకుని ఫోన్ తీసుకుని ఉడాయిస్తోంది. 

అలా చాలా మందిని బురిడీ కొట్టించిన ఆమె ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన అల్లూరి భాను అరవిందచౌదరి అనే యువతి ప్రేమించిన వ్యక్తితో 2015లో హైదరాబాద్ వచ్చింది. కొంతకాలం కాపురం చేసిన భర్త అనంతరం ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 

భర్తచేతిలో మోసపోయిన ఆమె తిరిగి గుంటూరు వెళ్లలేక ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేది. ఆ ఉద్యోగం మానేసిన ఆమె చెడు వ్యసనాలకు బానిసైంది. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసింది. అందుకు ఓఎల్ఎక్స్ ద్వారా స్మార్ట్ ఫోన్లు అమ్మేవారిని టార్గెట్ చేసింది. 

ఎక్కువ డబ్బు ఇష్తానని ఎరవేసి తాను చెప్పిన చోటికి పిలిపించుకుంటుంది. స్మార్ట్ ఫోన్ వ్యక్తి రాగానే ఫోన్ తీసుకుని ఇంట్లో వాళ్లకు చూపిస్తానని చెప్పి ఆ తర్వాత గోడ దూకి పరారవుతుంది. అలాంటి ఘటన ఓ వ్యక్తికి ఎదురైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.3.40 లక్షలు విలువ చేసే నాలుగు స్మార్టర్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై ఎల్ బీనగర్ పీఎస్ లో 3 కేసులు, సైదాబాద్ పీఎస్ లో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు స్పష్టం చేశారు.