తెలంగాణలో జనశక్తి నక్సల్స్ సమావేశం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు సీరియస్‌గా స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జనశక్తి సమావేశం నిర్వహించినట్టుగా చెబుతున్న విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో జనశక్తి నక్సల్స్ సమావేశం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో పోలీసులు సీరియస్‌గా స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో జనశక్తి సమావేశం నిర్వహించినట్టుగా చెబుతున్న విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌటుప్పల్‌లో పోలీసులు విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకన్నారు. విశ్వనాథ్‌తో పాటు అశోక్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వనాథ్, అశోక్‌ల అరెస్ట్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, నిన్న విశ్వనాథ్ పేరుతో జనశక్తి లేఖ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే తాము ఎలాంటి సమావేశాలు పెట్టలేదని విశ్వనాథ్ ప్రకటించినట్టుగా సమాచారం.
ఇక, కొద్ది రోజులుగా సిరిసిల్లలో జనశక్తి సమావేశాలంటూ ప్రచారం జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం నిర్వహించారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిరిసిల్ల సరిహద్దుల్లోని పోతురెడ్డిపల్లి ఫారెస్ట్ లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లో 8మంది జనశక్తి సాయుధులు, 65 మంది సానుభూతిపరులు సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో సిరిసిల్ల , కొనరావేపేట్ , ఎల్లారెడ్డి పెట్ , గంభీరావ్ పేట్ , ముస్తాబాద్ కు చెందిన పలువురు మాజీలు కూడా ఉన్నట్టుగా సమాచారం. జనశక్తి నక్సల్స్ మీటింగ్ వార్తల నేపథ్యంలో పోలీసుల శాఖ అప్రమత్తమైంది. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో తెలసుకునే పనిలో పడింది. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వివరాలను ఆరా తీసే పనిలో పడినట్టుగా సమాచారం.
ఇక, ఈ ఘటనపై సిరిసిల్ల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జనశక్తి మీటింగ్ అసలు జరగలేదని చెప్పారు. నక్సల్స్ పేరుతో బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జనశక్తి మీటింగ్ ప్రచారం వెనక కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని నక్సల్స్ సానుభూతిపరులపై నిఘా పెట్టినట్టుగా వెల్లడించారు.
