టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలకు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కౌంటరిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) నిన్న(సోమవారం) భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ (vinod kumar) అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ (BHEL) ఇచ్చిన యంత్రాలే భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు (bhadradri power project) వాడుతున్నారు... అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన సామగ్రి తుప్పుపట్టిన యంత్రాలా? అని నిలదీసారు. బండి సంజయ్ తన పార్టీపైనే ఆరోపణలు చేసుకుని టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారని వినోద్ అన్నారు.
''సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్, మోడీకి పైసలు ఇచ్చినట్లు ఉన్నాయి. గతంలో కరెంట్ కొనుగోళ్ళకు 20రూపాయలు ఛార్జ్ చేస్తున్నామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెలలో కూడా 6రూపాయల నుంచి 12 రూపాయలు పెట్టుకోవచ్చు అని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. అంబానీ, అదాని వచ్చినా కేసీఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎన్టీపిసికి 7 రూపాయలు ఇచ్చి కరెంట్ కొంటున్నాం... ఇప్పుడు కేసీఆర్ ఎన్టీపిసికి పైసలు ఇస్తుండా?'' అని వినోద్ నిలదీసారు.
''బండి సంజయ్ మాటలు తుగ్లక్ కంటే దారుణంగా ఉన్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ramagundam fertilizer factory)లో తెలంగాణ ప్రభుత్వం షేర్ హోల్డర్. ఈ ఫ్యాక్టరీలో తెలంగాణ ప్రభుత్వం ఈక్విటీ ఉంది'' అని వినోద్ తెలిపారు.
''బండి సంజయ్ ఆరోపణలు చేయడం మానేయండి..లేదంటే నిజాలు చెప్పండి. ఆయన టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు విరమించుకోవాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆరే లేకుంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసే పరిస్థితి ఉండేది'' అని వినోద్ పేర్కొన్నారు.
''దేశంలో అన్ని రాష్ట్రాల అప్పులు తీసుకుంటాయి... కానీ తీసుకున్న అప్పును సరిగ్గా చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ చెప్పింది. ఎఫ్ఆర్బియం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రజలు- రైతుల కోసమే. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే'' అని వినోద్ తెలిపారు,
''ప్రభుత్వ ఉద్యోగుల జితాలకు, అప్పులకు సంబంధం లేదు. రాష్ట్ర ఆదాయంతో జీతాలు, పథకాలు నడుస్తాయి. కొత్త అప్పులు అడిగేది మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికే. రాష్ట్ర ఆదాయాన్ని భట్టి అప్పులు వస్తాయి...కానీ కేంద్రం కావాలనే అడ్డుపడుతోంది. 8 ఏళ్లలో కేంద్రం లక్షల కోట్లు అప్పులు చేయొచ్చు..మేము మాత్రం చేయొద్దా? కేంద్రం వంద లక్షల కోట్లు వేటికోసం చేశారో చెప్పగలరా?'' అని వినోద్ ప్రశ్నించారు.
''రాష్ట్రం ఏర్పాటు నాటికి 7వేలు ఉన్న పరిస్థితి నుంచి 24వేల మెగావాట్ల ఉత్పత్తికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్. నేలమీద తిరిగితే విద్యుత్ కనిపించకపోతే విమానంలో బండి సంజయ్ తిరగాలి... అప్పుడు తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు తేడా తెలుస్తుంది... కరెంట్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది'' అంటూ సంజయ్ పై వినోద్ సెటైర్లు వేసారు.
