Telangana: వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయాలు ఇప్ప‌టినుంచే వేడెక్కుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ తెలంగాణ‌లోని సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వ పాల‌న‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

Telangana: రానున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల నేత‌లు నువ్వా-నేనా అనే విధంగా ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటూ రాజ‌కీయ కాకపెంచుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం లేద‌ని పేర్కొంటూ.. మూడోసారి కూడా అధికారం ద‌క్కించుకోవ‌డానికి అన్ని ర‌కాల వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మూడో సారి అధికారం ద‌క్కించుకుని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) సన్నద్ధమవుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు పట్ల తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జాప్యం జరుగుతోందన్న ఆగ్రహం యువతలో ఉందనీ, ఈ సమస్యను పరిష్కరించాలని ఆయ‌న ప్రభుత్వానికి సూచించారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్రశాంత్ కిషోర్ తనకు మంచి మిత్రుడని, కలిసి ముందుకు సాగ‌బోతున్నామ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసిన అనంత‌రం ఈ వ్యాఖ్య‌లు రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

కాగా, ఇటీవ‌ల ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. “రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారు” అని నివేదిక తేల్చిన‌ట్టు తెలిసింది. ఇక జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌ విభజన, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం, ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న అధికారుల బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రశాంత్‌ కిషోర్‌ ప్రభుత్వానికి చేసిన కొన్ని సూచనలుగా ఉన్నాయి. చాలా కాలంగా తమ అధీనంలో ఉన్నవారిలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నారని, రెండు సార్లు ప్రభుత్వ హయాంలో ఎటువంటి పదవిని పొందని పాత పార్టీ నాయకులకు న్యాయం చేయాలని మరియు అధికారిక విధుల్లో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యేలను నిరోధించడం ముఖ్య సూచ‌న‌లుగా ఉన్నాయ‌ని తెలిసింది. 

సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్దిష్ట ఉదాహరణలను ప్రజల్లో హైలైట్ చేయాలనీ, బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సోషల్ మీడియా సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. నెగిటివ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వవద్దని, పార్టీ సీనియర్, జూనియర్ నేతల మధ్య అంతరం తగ్గించాలని ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి సూచించారు. కాగా, రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలుపు నుంచి బీజేపీ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం తెలంగాణ సర్కారును ఇరుకున పట్టే చర్యలను కొనసాగిస్తోంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ ను అంతర్గత కుమ్ములాటలు వేధిస్తున్నప్పటికీ.. అధికార టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల తీరుపై విమర్శలతో విరుచుకుపడుతోంది. పార్టీ అంతర్గత సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టి ఐక్యంగా ఉంటూ ముందుకు సాగడానికి కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధమైందని సమాచారం. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారని సమాచారం.