తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నాయకులు కరోనా నుంచి తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్: రాజకీయ నాయకులపై నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం ప్రభావం పడినట్లే కనిపిస్తోంది. తాజాగా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తరపున ప్రచారం చేశారు.
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో పాటు టీఆర్ఎస్ స్థానిక నేతలు కోటిరెడ్డి, అంజయ్య యాదవ్ కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన కూడా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచార సభలో ప్రసంగించారు.
ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కోవిడ్ కు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు.
ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసివాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన వెంట ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 7432 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3.87 లక్షల మార్కును దాటింది.
కాగా, గత 24 గంటల్లో తాజాగా 32 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య తెలంగాణలో 1961కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 58.148 యాక్టివ్ కేసులు ఉండగా, ఆస్పత్రుల నుంచి 3.26 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు.
హైదరాబాదులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో హైదరాబాద్ 1434 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యా.యి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో కూడా కరోనా జోరు కొనసాగిస్తోంది. మేడ్చెల్ లో 606, రంగారెడ్డి జిల్లాలో 504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రం నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చినవారు 14 రోజుల పాటు విధిగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లాలని, కుటుంబ సభ్యుల నుంచి సామాజిక దూరం పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇళ్లలో కూడా వారు మాస్కులు ధరించాలని సూచించింది.