Hanumantha Rao: జవహర్‌లాల్ నెహ్రూకు ఏ ప్రధాని సాటిరారు.. : బీజేపీపై వీహెచ్ విమర్శలు
Jawaharlal Nehru: దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు పలువురు నేతలు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ చీఫ్ వీ.హనుమంత రావు అన్నారు.
Telangana: దేశ తొలి ప్రధాని, తమ పార్టీ అధినేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు దేశంలోని ఏ ప్రధానమంత్రి సాటి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. స్వతంత్ర భారతదేశానికి నెహ్రూ తొలి ప్రధాని అయినప్పుడు దేశంలో సూదిని తయారు చేసిన కంపెనీ కూడా లేదని, నెహ్రూ ప్రధాని అయిన తర్వాతనే వివిధ వస్తువుల తయారీ జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలపైనా విమర్శలు గుప్పించారు. ఇటీవలి కాలంలో కాషాయ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. దేశ జెండాను మారుస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ.. జాతీయ జెండాను మార్చే అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు పలువురు నేతలు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శలు గుప్పించిన వీహెచ్.. మోడీ ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదని ఆరోపించారు. దేశం ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉంటుందని, హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ నేతలు చేసే ఎలాంటి ఎత్తుగడనైనా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేసే వారిపై బీజేపీ రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నదని అన్నారు. ఈ కారణంగానే పలువురు నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కోసం ఎంతో చేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై అధికార పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
అంతకుముందు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైద్రాబాద్ లో ని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతో ఓట్లు దండుకున్నారన్నారు. పురాతన ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని జగ్గారెడ్డి విమర్శలు చేశారు. Bandi Sanjay ఓ పార్టీ రాష్ట్ర శాఖకు అద్యక్షుడితో పాటు ఎంపీగా కూడా ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. ఎంత సేపు శవ రాజకీయాలు చేయడమే బీజేపీ పనా అని ఆయన ప్రశ్నించారు.BJP నేతలు తమ తీరును మార్చుకోకపోతే ఆలయాల చరిత్ర తీసుకొని తానే బీజేపీ కార్యాలయం ముందు కూర్చొంటానని ఆయన చెప్పారు. ఇటీవల Karimnagar లో జరిగిన ఏక్తాయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
కాగా, త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు నువ్వానేనా అనే విధంగా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.