నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ సమీక్ష.. తెలంగాణలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు..!
తెలంగాణలో మద్యం పాలసీ (telangana liquor policy) గడువు ముగియడంతో.. నూతన మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మందుబాబులకు ఇది నిజంగానే శుభవార్త. తెలంగాణలో మద్యం దుకాణాల సంఖ్య మరిన్ని పెరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మద్యం పాలసీ (telangana liquor policy) గడువు ముగియడంతో.. నూతన మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్.. ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే గత రెండేళ్లలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలను అనుసరించి కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి కొత్తగా 350 దుకాణాలు పెరిగే అవకాశం ఉంది. అమ్మకాలు ఎక్కువగా ఉన్న చోట్ల కొత్త దుకాణాలకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసిన తర్వాత వైన్ షాపులకు టెండర్ల షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
ఇక, ప్రస్తుతం తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలు (Liquor Shops) ఉన్నాయి. వాటికి అదనంగా మరో 350కిపైగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. నూతన మద్యం పాలసీ 2021 డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుండగా.. 2023 నవంబర్ 30వ వరకు గడువు విధించనున్నారు. కొత్తగా మద్యం దుకాణాలు, ఇప్పుడు ఫుల్‌గా లాభాల్లో ఉన్న మద్యం దుకాణాల యజమానులు.. నూతన మద్యం పాలసీ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి లైసెన్సు ఫీజు, దరఖాస్తు రుసుముల్లో ఎలాంటి మార్పులు ఉంటాయనే ఆసక్తి నెలకొంది.
ఇక, రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ఇదివరకే ముగిసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ వల్ల తాము నష్టపోయినందున గడువును పొడిగించాలని మద్యదుకాణాల యజమానుల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. మద్యం దుకాణాల లైసెన్స్ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీచేశారు.
ఇక, కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబందించి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.