ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికార నృత్యంగా ఉన్న కూచిపూడి స్థానంలో తెలంగాణ కు ప్రత్యేక నృత్యం రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
శతాబ్ధాల చరిత్ర కలిగిన తెలంగాణ సాహిత్యం సంస్కృతిని వెలికితీసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ కంటూ ప్రత్యేకమైన నృత్యాన్ని త్వరలో ఆవిష్కరించేందేకు సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర నృత్యంగా కూచిపూడి కొనసాగింది. ఇప్పడది ఏపీ కే పరిమితిమైంది.
తెలంగాణలో శతాబ్ధాల చరిత్ర కలిగిన కాకతీయుల వీర నృత్యం పేరణిని సమైఖ్య పాలనలో ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ కళారూపం కాస్త వెలుగులోకి వచ్చింది.
అయితే ఇప్పటికీ తెలంగాణకు అంటూ ప్రత్యేకమైన నృత్యం అంటూ లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ‘కాకతీయం’ పేరుతో కొత్తగా రాష్ట్ర నృత్యాన్ని ఆవిష్కరించనున్నారు. ఫిబ్రవరి 5న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణ బ్రాండ్ గా రాష్ట్ర సంప్రదాయం పరిరక్షణే లక్ష్యంగా ఈ నృత్యం ఉంటుందని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి చందూలాల్ తెలిపారు. కాకతీయుల నాటి నృత్యాలను అధ్యయనం చేసి ఈ కొత్త నృత్యానికి రూపకల్పన చేసినట్లు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి తెలిపారు.
