తెలంగాణ రాష్ట్రంలో జూలై నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా కావాల్సిందిగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన తొలిగా సభ్యత్వం తీసుకున్నారు.. అంతేకాకుండా ఒక్కో నియోజకవర్గంలో 50 వేల మంది సభ్యత్వం తీసుకునేలా చేయాలని నేతలకు కేసీఆర్ టార్గెట్ ఇచ్చారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై 20లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టారు. విపక్షాలు, ఇతర పక్షాలు ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలను వెంటనే తిప్పి కొట్టాలని కూడా సీఎం సూచించారు.

జోగు రామన్న, అంజయ్యలు వరుస ఎన్నికలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని.. మున్సిపల్ ఎన్నికలు కొద్దిరోజులు వాయిదా వేయాలని సూచించగా ముఖ్యమంత్రి వారి వాదనను తోసిపుచ్చారు. అంతేకాకుండా వివిధ టీవీ ఛానెళ్లలో నిర్వహించే డిబేట్‌లకు కూడా ఎవరు వెళ్లాలనే దానిని సైతం పార్టీ నిర్వహిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.