తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టేందుకు టిఆర్ఎస్ భారీ కసరత్తే చేస్తోంది. కొడంగల్ లో అభివృద్ధి నినాదంతో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

కొడంగల్ లో జరిగిన సభలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కొడంగల్ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసిఆర్ కోట్లాది నిధులు అందిస్తున్నారని చెప్పారు. రైతులకు ఎకరాకు రూ. 4 వేలు రెండు పంటలకు అందించే ఏర్పాటు తో పాటు, వ్యవసాయం కోసం 24 గంటల విద్యుత్ సరఫరా , మద్దతు ధరలను అందిస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళల పింఛన్ లు మహిళా సంక్షేమం కోసం అందిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు కోట్లాది నిధులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు ఏళ్ల లో రూ. 52 కోట్లు పంచాయితీ రాజ్ నిధులు అందించినామన్నారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో బీటీ రోడ్లకు రూ. 140 కోట్లు అందించినట్లు చెప్పారు. అందులో కొడంగల్ కే 50 కోట్లు ఇచ్చామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఆర్ మంత్రి గా జానారెడ్డి కాలంలో కనీసం రూ. 2 కోట్లు అందించలేని దుస్థితి ఉండేదన్నారు. నాడు పైరవీలతో కాసులకు కక్కుర్తి పడేవారన్నారు. గ్రామాల నుంచి మండలాలకు, జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి  రూ. 18 వేల కోట్లతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

మొత్తానికి కొడంగల్ లో పాగా వేసేందుకు అధికార టిఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే చాలారోజులుగా ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నా.. రేవంత్ ను ఎదుర్కోవడంలో ఇంకా తడబడుతూనే ఉన్న పరిస్థితి ఉంది.