రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని, డిమాండ్ లేదనే మొక్కజొన్న పంట వేయొద్దని తెలిపామని, కానీ ప్రత్యామ్నాయ పంట కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని, కొనడం కష్టమే అని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు స్పష్టం చేశారు. జొన్నపంటను కొనుగోలు చేయాలని రైతులు ఫోన్ చేసినప్పుడు ఈ మాటలు అన్నారు.

టీ– శాట్‌ ఛానల్ లో సోమవారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఫోన్ చేసిన రైతులకు పలు సూచనలు చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన భీమ గోవిందరాజు టి శాట్‌ ఛానల్ కి ఫోన్ చేయగా మంత్రి స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట వేయొద్దని చెప్పిందని... ప్రత్యామ్నాయంగా జొన్న పంట వేశామని, ప్రభుత్వం కొనాలని మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి స్పందిస్తూ... రైతులు ప్రత్యామ్నాయ పంటను వేయాలని మాత్రమే చెప్పామని అన్నారు. ఆ పంటను ప్రభుత్వం కొంటుందని ఎక్కడా చెప్పలేదని మంత్రి తెలిపారు.

మండలంలోని ధన్నూరు గ్రామానికి చెందిన పసుల చంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మంగళవారం జొన్న పంట కొనుగోలు చేయాలని ఫోన్లో విన్నవించారు. మంత్రి స్పందిస్తూ జొన్న పంటను కొనుగోలు చేయడం మా చేతుల్లో లేదని.. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ ను రద్దు చేసిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను మాత్రమే వేయాలని రైతులకు సూచించారు. 

తమ జిల్లాలో 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారని, ప్రభుత్వం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. జొన్న పంట వేయమని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. మంత్రులు పంట కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.