సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరై.. మల్లన్న కల్యాణోత్సవానికై స్వామి వారికి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని మంత్రి హరీశ్‌రావు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా మల్లన్న శరణు శరణు అంటూ మార్మోగిపోయింది. శివశక్తులు శివాలెత్తి పోయారు. మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వచ్చారు. సంప్రదాయబద్ధంగా ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో మల్లన్న స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, మల్లన్న జాతర రాష్ట్రానికే తలమానికమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించడం, స్వామివారికి ప్రభుత్వం తరుఫున బంగారు కిరీటం సమర్పించడం బాగా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ. 30 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామిని రెండుసార్లు దర్శించుకున్నారని తెలిపారు.
ఈ ఏడాది మల్లన్న స్వామికి ఒక కిలో స్వర్ణ కిరీటాన్ని సమర్పిస్తున్నామనీ, వచ్చే ఏడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్ల కూడా ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెలాంటి మల్లన్న సాగర్ నిర్మాణంలో కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగామని అన్నారు. మల్లన్నస్వామి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని.. పలు జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నారని మంత్రి గుర్తు చేశారు.
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న స్వామి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. ప్రతి యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ జరుగుతోంది.వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా… వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.
రెండు రోజులపాటు జరుగనున్న స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటలకు స్వామి వారికి బలిహరణం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. మరోసటి రోజు (19వ తేదీ సోమవారం) ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
