Rythu Bandhu: రైతుబంధుపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..
Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తోంది. తాజాగా రైతు బంధు నిధుల విషయమై కూడా శుభవార్త చెప్పింది.
Rythu Bandhu: ఎన్ని ఇబ్బందులు తలెత్తిన రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. నిజామాబాద్ లోని నందిపేట లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రెండెకరాల లోపు భూమి ఉన్న 29 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతు బంధు పథకం లబ్ధిని బదిలీ చేశామని, మిగిలిన రైతులకు డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం “రైతు భరోసా” పథకాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉందనీ, రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చుతోందని మంత్రి అన్నారు.
రైతులకు రుణమాఫీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంకితభావంతో ఉన్నారని, వ్యవసాయరంగాన్ని ఆదుకునే విధానాలపై ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో నూతనంగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తోందనీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.