తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలను హెచ్చరించారు. గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కొన్ని విప‌క్ష పార్టీలు, కొన్ని సంస్థ‌లు నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొడుతున్నాయ‌ని ఆగ్రహం  వ్యక్తం చేశారు. త‌మ‌కే దిక్కుమొక్కు లేక ఉద్యోగం లేని వాళ్లు.. ఉద్యోగాలంటూ నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రానున్న రోజుల్లో బీసీ వ‌ర్గాల భ‌విష్య‌త్ స్వ‌ర్ణ యుగంగా మారుతుందని జోస్యం చెప్పారు.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో మెజీషియ‌న్ కోర్సును పూర్తి చేసిన‌ 25 మంది అభ్యర్థుల‌కు మెజీషియ‌న్ కిట్స్‌, స‌ర్టిఫికెట్ల‌ను మంత్రులు జోగు రామ‌న్న‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ గురువారం స‌చివాల‌యంలోని డీ బ్లాక్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జోగు  రామ‌న్న మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచ‌న‌లే.. బీసీ వ‌ర్గాల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. అంత‌రించిపోతున్న కుల వృత్తుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త‌ను గుర్తించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.  అందులో భాగంగా బీసీ యుత‌ను ప్రోత్స‌హించేందుకు స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అశోక్ కుమార్‌, అద‌న‌పు కార్య‌ద‌ర్శి సైదా, బీసీ స్ట‌డీ స‌ర్కిల్ డైరెక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌, ర‌జ‌క ఫెడ‌రేష‌న్ ఎండీ చంద్ర‌శేఖ‌ర్‌, ప్ర‌ముఖ మెజీషియ‌న్ సామ‌ల వేణు, త‌దిత‌రులు  పాల్గొన్నారు.