ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తాము సిద్దంగా ఉన్నామని  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చెప్పారు.

హైదరాబాద్:ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్దంగా ఉన్నామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయంపై స్పందించారు. శుక్రవారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఎన్నికలకైనా కేసీఆర్ సర్కార్ సిద్దంగా ఉందన్నారు. 

రేపు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా తాము రెడీగా ఉన్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం ఇప్పటిది కాదన్నారు. దేశంలో మోడీ క్రేజ్ పడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఓటమి తప్పదనే నివేదికలు బీజేపీకి అందాయన్నారు.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి పెడితే లాభం జరుగుతుందనే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.జమిలి ఎన్నికలు అంటే అన్ని ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు కోసమేనని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ కోసం కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. దేశంలో ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తామని 2014లో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గతంలో కూడ పలుమార్లు దేశంలో ఒకే సారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తావించారు. 

also read:జమిలి ఎన్నికలపై కీలక పరిణామం: రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ

జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో అజెండాను త్వరలోనే వెల్లడించనున్నట్టుగా పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఇవాళ తెలిపారు.