ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

అనంతరం తలసాని మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలను ఇంటికి పంపే రోజు దగ్గర్లోనే ఉందని తలసాని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు.. కేసీఆర్ పేరును నిద్రలో కూడా తలుచుకుంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు.

ఐదేళ్లు పరిపాలనలో చేసేందేమీ లేదు కాబట్టి కేసీఆర్‌ను అడ్డం పెట్టుకుని బాబు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆంధ్రులను కొడుతున్నారని, వారి ఆస్తులను లాగేసుకుంటున్నామని చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

హైదరాబాద్‌లో అందరి కంటే ఎక్కువ ఆస్తులున్న వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రేనని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలకే ఇక్కడ అందరి కంటే ఎక్కువ ఆస్తులున్నాయన్నారు. ఏపీ రాజకీయాలన్నీ ప్రస్తుతం కేసీఆర్, తెలంగాణ చుట్టూనే తిరుగుతున్నాయని తలసాని వ్యాఖ్యానించారు.

ఎల్‌బి స్టేడియంలో శుక్రవారం జరిగే కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.