Asianet News TeluguAsianet News Telugu

ఆధారాలతో సహా వారి పేర్లు బయటపెడతా.. ఎన్నికల అఫిడవిట్ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై (election affidavit) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. 

Telangana Minister srinivas goud Response over allegations related to election Affidavit
Author
Hyderabad, First Published Jan 26, 2022, 1:54 PM IST

తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్‌పై (election affidavit) వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆమోదించిన తుది అఫిడవిట్‌నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు.  ఎన్నికల టైమ్ నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు. Delhi High Coutలో 2021 డిసెంబర్‌లో కేసు డిస్మిస్ అయిందని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో ఆరా తీస్తామన్నారు. ఇతరులు వేసిన పిటిషన్ లు తెలంగాణ హైకోర్టు లో విచారణలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయం గమనించకుండా తనపై బురద జల్లుతున్నారు. ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కొలేని వారే ఈ ఆరోపణలు చేస్తున్నారని.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతామని చెప్పారు. ఆధారాలతో సహా పేర్లు వెల్లడించి భరతం పడతానని హెచ్చరించారు.

తమకున్న ఆదరణ చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మీడియా చానల్స్ పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. పిటిషన్‌లో ఉన్న అంశాలను ప్రచురించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టులో కేసు నడుస్తోందని అవాస్తవాలు రాశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్రలు చేశారని అన్నారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని చెప్పుకొచ్చారు. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని ఆరోపించారు. 

ఇక, ప్రముఖ తెలుగు వార్త సంస్థ ఏబీఎన్ ప్రసారం చేసిన కథనం ప్రకారం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో (2018 telangana assembly elections) మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను శ్రీనివాస్ గౌడ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపాలతో వున్న మొదటి అఫిడవిట్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించి.. దాదాపు నెలన్నర తర్వాత సవరించిన అఫిడవిట్‌ను అప్‌లోడ్ చేసినట్లు ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఫిర్యాదుదారు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారితో కేంద్ర ఎన్నికల కమీషన్ (election commission of india) నివేదిక తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. నివేదిక పంపిన కొద్దిరోజులకే సీఈవో శశాంక్ గోయల్ (shashank goyal) కేంద్రానికి బదిలీపై వెళ్లడం గమనార్హం. ట్యాంపరింగ్ జరిగిన విషయం నిజమేనంటూ.. శశాంక్ గోయల్ నివేదికలో  పేర్కొన్నట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ట్యాంపరింగ్ ఆరోపణలపై అంతర్గతంగా సాంకేతిక బృందంతో ఈసీ విచారణ జరిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios