ఎల్బీ నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగి గాయపడ్డ కార్మికులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, ట్రీట్‌మెంట్‌కు అవసరైన ఏర్పాట్లన్నీ చేస్తామని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఓ ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. వారంతా బిహార్‌కు చెందిన వలస కూలీలే. వీరిని హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ పరామర్శించారు. హాస్పిటల్ వెళ్లి వారితో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన వారు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.. వారి ట్రీట్‌మెంట్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం అని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో కమిటీ వేసి, అందుకు అదనంగా జేఎన్టీయూ ఆధ్వర్యంలో విచారణ చేయించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని చెప్పారు.

Also Read: సాగర్ రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ ప్రమాదం.. కూలీలను పరామర్శించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
ఒక వేళ ఈ ప్రమాదం అక్కడ పని చేయిస్తున్న వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల గనక జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సహా పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
