Farmers: కేంద్రంపై కేటీఆర్ ఫైర్.. ‘ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్’
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేసి మరణించిన రైతుల వివరాలు తమ దగ్గర లేవని, వారికి పరిహారం అందించే అవకాశం అంతకన్నా లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్ అని విమర్శలు గుప్పించారు. అంతేకాదు, వరుసగా కేంద్ర ప్రభుత్వం ఇలా తమ దగ్గర వివరాలు లేవని చెప్పిన ఉదంతాలను ఏకరువు పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డేటా ఉండదని విమర్శించారు. అసలు ఎన్‌డీఏ ప్రభుత్వం అంటేనే (NDA అంటే No Data Availabe Govt) నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్ అని విరుచుకుపడ్డారు. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం ఇదే తరహాలో తమ దగ్గర సమాధానం లేదని చేతులు దులుపుకునే పని చేసిన ఉదంతాలను ఆయన ఏకరువు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ డేటా ఉండదంటూ ఆయన కొన్ని వార్తా క్లిప్పింగ్‌లను తన ట్వీట్‌కు జత చేశారు. మరణించిన రైతులవే కాదు.. ఆరోగ్య సేవలు అందించే స్టాఫ్ మరణాలు, వలస కార్మికుల మరణాలు అంటూ వరుసగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నను, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంబంధించిన ప్రతులనూ ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నదా? తీసుకుంటే ఏ నిర్ణయాలు తీసుకున్నది? తీసుకోకుంటే ఎందుకు నిర్ణయించడం లేదు? అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు అడిగాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా సమాధానం చెప్పింది. రైతు ఆందోళనలో మరణించిన వారి వివరాలు తమ దగ్గర లేవని, కాబట్టి, వారికి పరిహారం అందించే ప్రశ్న ప్రస్తావనకు రాదని పేర్కొంది. ఈ సమాధానంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో మరణించిన పేషెంట్ల వివరాలూ లేవని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాధానంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Also Read: నిరసనలో మరణించిన రైతుల వివరాల్లేవు.. పరిహారమూ ఉండదు: పార్లమెంటులో కేంద్రం
ఎన్‌డీఏ అంటేనే నో డేటా అవెలేబుల్ గవర్నమెంట్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం దగ్గర మరణించిన వైద్యారోగ్య సిబ్బంది వివరాలు ఉండవని, కరోనాతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడటం మూలాన మరణించిన వారి వివరాలూ ఉండవని పేర్కొన్నారు. అంతేకాదు, వలస కార్మికుల మరణాలు, కరోనా కారణంగా ఊడిన ఉద్యోగాల వివరాలూ తెలియవని, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్దిదారుల వివరాలూ ఉండవని తెలిపారు. ఇప్పుడు తాజాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ మరణించిన రైతలు వివరాలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వడ్ల కొనుగోలు వ్యవహారమై కేంద్ర ప్రభుత్వంతో ‘యుద్ధాన్ని’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా రైతుల పక్షాన ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర నిరసన చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో జరుగుతున్న ఆందోళనల్లో మరణించిన రైతులకు రూ. 3 లక్షల పరిహారాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 25 లక్ష పరిహారాన్ని మరణించిన రైతుల కుటుంబాలకు అందించాలని డిమాండ్ కూడా చేశారు.
Also Read: కేంద్రం పట్టించుకోకున్నా.. తెలంగాణ అండగా నిలుస్తున్నది.. 29న ‘పార్లమెంటు ఛలో’ : ఢిల్లీలో రైతు సంఘాలు
గతేడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దులు సింఘు, టిక్రి, ఘాజిపూర్‌లలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఆందోళనలకు ఏడాది నిండింది. ప్రధానమంత్రి సాగు చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇస్తూ రైతులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా పదిరోజుల్లో ఉభయ సభలు మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ బిల్లును ఆమోదించాయి. అయితే రైతులు మాత్రం ఇంకా ఆందోళనలు విడిచిపెట్టడం లేదు. సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరపై చర్చించాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని, ఈ ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను వారు ధ్రువీకరించారు. త్వరలోనే మరణించిన రైతుల కుటుంబాల వివరాలు పంపిస్తామని తెలిపారు.