ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన నూతన మున్సిపాలిటీ చట్టం హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. 

ఈ సందర్భంగా కౌన్సిలర్ స్థానానికి పోటీ చేసే ఆశావాహులకు మంత్రి  కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. నూతన మున్సిపల్ చట్టాన్ని సక్రమంగా చదువుకుని ఎన్నికల బరిలోకి దిగాలంటూ చురకలంటించారు. పదవుల కోసం పోటీ చేసి పని చేయనంటే కుదరదని తేల్చి చెప్పేశారు. 

సరిగ్గా చట్టం చదువుకుని రంగంలోకి దిగాలని సూచించారు. తాను ముందే చెప్తున్నా అంటూ పదేపదే హెచ్చరించారు. పనిచేయకపోతే పదవిపోతుందని ముందే చెప్తున్నా అంటూ చెప్పేశారు. ఆ తర్వాత తనను తిట్టొద్దన్నారు. నూతన మున్సిపాలిటీ చట్టం చాలా కఠినంగా ఉందన్నారు. 

ప్రజలకు సేవ చేయాలి, పద్ధతిగా పనిచేయాలనే ఉద్దేశంతో కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎక్కడైనా, ఎవరికైనా పదవిపోతే ఆ తర్వాత తన వద్దకు వచ్చి లొల్లిపెడితే లాభం లేదని తేల్చి చెప్పేశారు మంత్రి కేటీఆర్. ఎందుకంటే మున్సిపల్ మంత్రి అయిన తనకు సైతం పవర్ లేదన్నారు. 

కేవలం శాసన సభకు మాత్రమే ఉందన్నారు. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలా వీరంతా తాము ఎంచుకున్న పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే వారిని డైరెక్ట్ గా చట్టం ప్రకారమే తొలగించవచ్చనన్నారు. కాబట్టి ఒకటికి రెండుసార్లు చట్టాన్ని చదువుకుని రంగంలోకి దిగాలని ఆ తర్వాత తనను తిట్టుకోవద్దని చెప్పారు మంత్రి కేటీఆర్.  
పట్టణీకరణ జరగాల్సిందే కానీ విచ్చలవిడితనం పనికిరాదన్న లక్ష్యంతో నూతన మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు  కేటీఆర్. అందువల్లే ఈ మున్సిపల్ చట్టం చాలా కఠినమైనదన్నారు. ఈ చట్టాన్ని పదునుగా, కఠినంగా అమలు చేసి తీరతామంటూ స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. 
 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో తొలిలాజిస్టిక్ పార్క్ ప్రారంభం: నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ వరాలు