Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో తొలిలాజిస్టిక్ పార్క్ ప్రారంభం: నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ వరాలు

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పోరాడి సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుందని స్పష్టం చేశారు. 
 

telangana minister ktr opened intigrated logistic park at ibrahim patnam
Author
Hyderabad, First Published Oct 11, 2019, 1:28 PM IST

ఇబ్రహీంపట్నం: పరిశ్రమల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పోరాడి సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుందని స్పష్టం చేశారు. 

శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన్ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులలోకి మురుగునీరు వచ్చి చేరకుండా రూ.23 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ట్రంక్ లైన్ పనులకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఇబ్రహీంపట్నంలోని మంగళ్‌పల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.22 కోట్లతో హెచ్ఎండీఏ - ఆన్‌కాన్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేసింది. పెద్దఅంబర్‌పేట జంక్షన్ నుంచి బాట సింగారం వరకు రూ. 1.82 కోట్లతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర స్ట్రీట్ లైట్ల ఏర్పాటు పనులను కూడా కేటీఆర్ ప్రారంభించారు. 

మంగళ్ పల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మరో 8 లాజిస్టిక్ పార్క్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కువల్ల ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా మరో 1000 మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలంటే యువతకు నైపుణ్యత శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నైపుణ్యత ఉంటేనే ఉద్యోగం సాధించవచ్చునని కేటీఆర్ స్పష్టం చేశారు.

స్కిల్ అండ్ నాలెడ్ట్ హబ్ కింద యువతకు నైపుణ్యత శిక్షణ కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చదువుకు తగ్గ ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. 

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకునేందుకు రెండు చోట్ల లాజిస్టిక్ పార్కులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

నాగార్జునసాగర్ హైవే మంగళ్‌పల్లి వద్ద, మరోకటి విజయవాడ హైవే బాటసింగారం వద్ద కలిపి ఈ రెండు లాజిస్టిక్ పార్కు పనులకు 2017 అక్టోబరులో శంకుస్థాపన చేసినట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే బాట సింగారం వద్ద నెలకొల్పబడిన లాజిస్టిక్ పార్కును కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.  

పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్ పద్ధతిలో బాటసింగారంలో రూ.35 కోట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో, మంగళ్‌పల్లిలో 22 ఎకరాల్లో చేపట్టిన లాజిస్టిక్ పార్కు పనులను నిర్ణీత గడువులోగా హెచ్‌ఎండీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే మంగళ్‌పల్లి ఫేజ్-1 లాజిస్టిక్ పార్కును తొలుత అందుబాటులోకి తీసుకువచ్చారు.
 
లాజిస్టిక్ హబ్ సేవలను ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తాము ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల కంటే పోటీపడి మరీ కంపెనీలను సాధిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios