రైతులకు సంఘటితంలో ఉండే శక్తిని విడమరిచి చెప్పి, కేసీఆర్ వారికి కావాల్సినవన్ని అందిస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. శుక్రవారం సిరిసిల్ల జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

ఎక్కడో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి పిలుపునిస్తే.. మారుమూల ప్రాంతంలో ఉన్న రైతులు అందులోని సారాన్ని అర్ధం చేసుకున్నారని మంత్రి ప్రశంసించారు. నాటు, సాగు, కోత దశలో నియంత్రిత సాగు విధానంలో ముందుకెళ్తే... ఈ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ ఆకాంక్షించారు.

అంకెలు, పేపర్ల మీద చూసుకుని అంతా బాగుంది అనుకోకుండా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గ్రామగ్రామాన తిరిగి రైతు బంధు అందేలా చూడాలని మంత్రి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వ్యవసాయం యాంత్రీకరణ జరగాలని కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆధునిక, సాంకేతిక పద్ధతులను కలగలిపి ముఖ్యమంత్రి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.