ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తీసుకొస్తోందన్నారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తాము కూడా మిషన్ భగీరథ నీటిని తాగుతున్నామని.. వీటిని బట్టలు ఉతకడానికి, మిగిలిన పనులకు ఉపయోగించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం కల్వకుర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నీళ్లను కొనుక్కుని తాగే పరిస్ధితి పోవాలన్నారు.

Also Read:ట్రంప్‌తో విందుకు కేసీఆర్: ఇవాంక, మెలానియాలకు స్పెషల్ గిఫ్ట్

ఇంటింటికీ వస్తున్న మిషన్ భగీరథ నీరు సురక్షితమైనవని అధికారులు, నేతలు ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్ సూచించారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ద్వారా వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తోందని మంత్రి తెలిపారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలోనే పడిపోయే స్థితికి చేరిన కరెంట్ స్తంభాలను గుర్తించాలని వార్డ్ స్పెషల్ ఆఫీసర్లు గుర్తించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య ప్రణాళిక, హారిత ప్రణాళిక, మంచినీటి ఆడిట్, విద్యుత్ స్తంభాలను గుర్తించాలని కేటీఆర్ తెలిపారు.

కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇంటికి వచ్చే వారికి ఇవ్వాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read:ఎర్రవల్లి సర్పంచ్‌కు ఎక్కువ.. చింతమడక ఎంపీటీసీకి తక్కువ: కేసీఆర్‌పై రేవంత్ సెటైర్లు

తడి చెత్త ద్వారా వచ్చే సేంద్రియ ఎరువును కల్వకుర్తి రైతులకే అందజేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పొడి చెత్తను వేరు చేసి దాని ద్వారా సిరిసిల్లలో నెలకు 2.50 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి విధానాల వల్ల పట్టణాల్లో దోమలు, పందుల బెడద తగ్గుతుందని కేటీఆర్ చెప్పారు.

ఖాళీ స్థలాలను సరిగా నిర్వహించని వారికి నోటీసులు ఇవ్వాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ గ్రామంలోనూ లేని విధంగా ప్రతి గ్రామం, పట్టణంలోనూ నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాయేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా అనేక విపరీతాలు చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు.