కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి వెళ్లే పన్నుల్లో సంగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

2014 నుంచి ఇప్పటివరకు రూ. 2,75,926 కోట్లను కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకోగా రూ.1,40,329 కోట్లను మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని ఆయన వివరించారు.

కీలక రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే రాష్ట్ర జీడీపీ దేశంతో పోలిస్తే భారీగా పెరిగిందని కేటీఆర్ చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తి 22.8 శాతంగా ఉందన్నారు.

దేశంలో రుణాలు, జీఎస్‌డీపీ నిష్పత్తి తక్కువ కలిగిన 5 రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు ఈ విషయాలు తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సమ్మిళితమైందని.. ముఖ్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్‌ లాంటి రంగాల్లోనూ వృద్ధి కొనసాగిందని కేటీఆర్ చెప్పారు. 2014 నుంచి 2020 మధ్యలో దేశవ్యాప్తంగా తలసరి ఆదాయం 54.9 శాతంగా ఉంటే, తెలంగాణలో తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9 శాతంగా నమోదైందన్నారు.

అద్భుతమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాలు, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమాల ద్వారా  తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.