సిరిసిల్ల నుండి మరోసారి బరిలోకి కేటీఆర్: నామినేషన్ దాఖలుకు ముందు ప్రగతిభవన్ లో పూజలు
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంత్రి కేటీఆర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోసారి ఇదే నియోజకవర్గం నుండి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసేందుకు గురువారంనాడు ఉదయం హైద్రాబాద్ ప్రగతి భవన్ నుండి బయలుదేరారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కేటీఆర్ తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి కేటీఆర్ తొలిసారిగా బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న కెకె మహేందర్ రెడ్డిని కాకుండా కేటీఆర్ ను బరిలోకి దింపింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో కెకె మహేందర్ రెడ్డి రెబెల్ గా బరిలోకి దిగారు. కెకె మహేందర్ రెడ్డిపై స్వల్ప ఓట్లతో కేటీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లో కూడ కేటీఆర్ విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014, 2018 లలో కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్ కు చోటు దక్కింది. 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడ కేటీఆర్ కొనసాగుతున్నారు.
మరోసారి సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మంచి రోజు కావడంతో కేటీఆర్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావులు కూడ ఇవాళే నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సిరిసిల్లలో పార్టీ కార్యకర్తలతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి కేటీఆర్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
తెలంగాణలో మూడో దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్దితో పాటు విపక్షాల తీరును ఎండగడుతున్నారు