హైదరాబాద్:  ట్విట్టర్ లో వచ్చిన మేసేజ్ ఆధారంగా తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుడికి ఆదివారం నాడు ఇంటికి వెళ్ళి మిట్ట యాదవరెడ్డిని సన్మానించారు.

మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా అంటూ నిధి రెడ్డి అనే 17 ఏళ్ల అమ్మాయి మంత్రి కేటీఆర్‌కు మే 4వ తేదీ నాడు రాత్రి 10:22 గంటలకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. 

దీనికి మంత్రి కెటిఆర్ స్పందించారు. తప్పకుండా చేద్దామని కెటిఆర్ ఆ అమ్మాయికి రిప్లై ఇచ్చారు. వెంటనే కెటిఆర్ కార్యాలయం నుండి ఆ అమ్మాయికి ఫోన్ చేసి వివరాలను కనుగొన్నారు. ఇవాళ తెలంగాణ సీఎం కెటిఆర్ హబ్సిగూడా లోని స్ట్రీట్ నెంబర్ 7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవ రెడ్డి ఇంటికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లారు. 


నడవలేని దశలో ఎక్కువగా మంచంపైనే ఉంటున్న మిట్ట యాదవ రెడ్డి గారిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక జ్ఞాపికను కూడా అందించారు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో మిట్టయాదవ రెడ్డి కేక్ కట్ చేయగా వారికి మంత్రి కేటీఆర్ కేక్ తినిపించారు. 

గతంలో అయన చేసిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పోరాటాల్లో తాను నిర్వహించిన పాత్రను అయన మంత్రి వివరించారు. తదనంతరం యాదవ రెడ్డి గారు స్వయంగా రచించిన "నా జ్ఞాపకాలు" అనే ఆత్మకథను మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గార్లు ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ అనుక్షణం తాను తెలంగాణ కొరకే పరితపించానని చెప్పారు.  కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధిపథంలో నడవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని యాదవరెడ్డి గారు కితాబిచ్చారు.  


 
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మిట్ట యాదవ రెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. మొక్కవోని దీక్షతో ఆయనలాంటి ఎందరో చేసిన పోరు ఫలితమే ఇవ్వాళ మనం శ్వాసిస్తున్న స్వేచ్చావాయువులు అని అన్నారు. చరిత్రను చూసిన యాదవ రెడ్డి లాంటి పెద్దవాళ్ల ప్రశంసలు తమను మరింత స్పూర్తితో ముందుకు నడుపుతాయన్నారు.