తెలంగాణ మంత్రి జూపల్లి డెడ్ లైన్ : ఆగ‌స్టు 15

telangana minister jupally deadline is august 15
Highlights

లేట్ అయితే సహించేది లేదు

హైద‌రాబాద్ : పాల‌మూరు జిల్లాలోని నీటి పారుద‌ల ప్రాజెక్టుల నిర్మాణ ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని...అవ‌స‌ర‌మైతే షిఫ్టుల వారీగా ప‌నులు చేప‌ట్టాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. పాల‌మూరు, క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌తో పాటు భీమా ప్రాజెక్టుల ప‌నుల పురోగ‌తిపై నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో స‌చివాల‌యంలో శుక్ర‌వారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్ష నిర్వ‌హించారు. ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఈ ఎన్ సీ ముర‌ళీధ‌ర్ రావుల‌తో ఆయా ప్రాజెక్టుల ప‌నుల పురోగ‌తిపై చ‌ర్చించారు. క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో 0-130 కిలో మీట‌ర్ల ప‌నులు చేప‌డుతున్న కాంట్రాక్టు ఏజెన్సీల నిర్వ‌హ‌కులు కూడా స‌మావేశంలో పాల్గొన్నారు.

క‌ల్వ‌కుర్తి ఎత్తిపోతల ప్ర‌ధాన కాల్వ ప‌నుల‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై ప్ర‌తి 10 రోజుల‌కు ఒక‌సారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు సూచించారు. దీనికి స‌మాంత‌రంగా డిస్ట్రిబ్యూట‌రీ కాలువ‌ల ప‌నుల‌ను కూడా చేప‌ట్టాల‌న్నారు. నాగ‌ర్ క‌ర్నూలు, వ‌న‌ప‌ర్తి జిల్లాల్లోని ల‌క్ష ఎకరాల ఆయ‌క‌ట్టుకు ఆగ‌స్టు 15 నాటికి నీరందించే ల‌క్ష్యంతో యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు జ‌ర‌పాల‌న్నారు.

ఎక్క‌డైనా ఇబ్బందులుంటే స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల స‌హాయంతో వాటిని ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు పోవాల‌న్నారు. 0-90 కిటో మీట‌ర్ల ప్ర‌ధాన కాల్వ‌లో మొత్తం 207 నిర్మాణాల‌కు 150 పూర్తి చేయ‌డం జ‌రిగింద‌ని అధికారులు వివ‌రించారు. మిగిలిన వాటిలోనూ 28 పురోగ‌తిలో ఉన్నాయ‌ని, వీటిని కూడా జూన్ నెలాఖ‌రు నాటికి పూర్తి చేస్తామ‌ని అధికారులు తెలిపారు.

క‌ల్వ‌కుర్తి , పాల‌మూరు ఎత్తిపోత‌ల‌తో పాటు భీమా ప‌థ‌కాల‌ను పూర్తి చేసి పాల‌మూరు జిల్లాను స‌స్య‌శ్యామలం చేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందుకోసం ఇంజ‌నీరింగ్ అధికారులతో పాటు.. కాంట్రాక్టు ఏజెన్సీల నిర్వ‌హ‌కులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాల‌న్నారు. స‌మావేశంలో సీఈలు ఖ‌గేంద‌ర్‌, లింగ‌రాజు, ఎస్ ఈ భ‌ద్ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

loader