Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మంటలు రాజేసేందుకే మునుగోడు ఉప ఎన్నికలు:బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

తెలంగాణలో మంటలు రాజేసేందుకే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.  ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 
 

Telangana Minister Jagadish Reddy Serious Comments on BJP
Author
First Published Oct 12, 2022, 3:57 PM IST

మునుగోడు: సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణాలో మంటలు రాజేసేందుకే  మునుగోడు ఉప ఎన్నికను  బీజేపీ తీసుకు వచ్చిందని  తెలంగాణ రాష్ట్ర విద్యత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి చెప్పారు. 

గురువారం నాడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొరటికల్, వెల్మకన్నె గ్రామాల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మునుగోడు  ఉప ఎన్నికల వెనుక ముమ్మాటికీ ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మరో సంవత్సరంలో రాష్ట్ర శాసనసభ కు సాదారణ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఎందుకు రాజీనామా డ్రామాలు అంటూ ఆయన మండిపడ్డారు. 

 ఒక వ్యక్తి కుటుంబ ప్రయోజానాల కోసమే ఈ ఉప ఎన్నికను ప్రజలపై బలవంతంగా రుద్దారని ఆయన పరోక్షంగా  కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డిపై విమర్శించారు.  2018 లో ఎమ్మెల్యేగా  ఎన్నికైన తర్వాత అధికారంలో లేక పోవడంతో  నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేయలేకపోయినట్టుగా రాజగోపాల్ రెడ్డి  బీరాలు పలికాడన్నారు.  రూ. 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే  కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరారన్నారు. ఆ పార్టీ  కుతంత్రాలలో బాగంగా ఈ ఎన్నికలు తెచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. 

నాలుగేళ్లలో చేయలేని అభివృద్ధి ఈ సంవత్సరంలో ఎలా  చేస్తారో  ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన  రాజగోపాల్ రెడ్డిని డిమాండ్ చేశారు.మునుగోడు తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఫ్లోరోసిస్ మహమ్మారి ని కేవలం ఆరేళ్లలో తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాలతో ప్రజలకు సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకానికి రూ. 50,000 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.ఈ పథకానికి  రూ. 12000 కోట్లు తెలంగాణాకి అందించాలంటూ  నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులు బుట్ట దాఖలు చేసినా కేంద్రం ఒక్క పైసాఇవ్వలేదన్నారు.

 బిజెపి తెలంగాణాలో నెరుపుతున్న కుట్ర రాజకీయాలలో భాగస్వామిగా మారి కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరినందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందని మంత్రి జగదీష్  రెడ్డి ఆరోపించారు. 

మోటర్లకు మీటర్లు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టి వత్తిడి తేవడం అందులో భాగమే నన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఈ  పథకానికి తాము అంగీకరించలేదన్నారు.గుజరాత్ లో ఈ పథకం అమలు చేస్తున్నట్టుగా చెప్పారు. నాలుగు ఎకరాలున్న రైతు నెలకు రూ. 5500విద్యుత్ బిల్లుల కింద చెల్లిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.   రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకలపై ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతుందన్నారు. దీంతో బీజేపీకి భయం పట్టుకుందని  మంత్రి చెప్పారు. 

alsoread:మునుగోడు బైపోల్ 2022:రేపు టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్

 మునుగోడు లో పొరపాటున బిజెపి కి ఓటు వేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పథకాలు అమలు చేయాలనే  ఒత్తిడి  పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,పరకాల శాసన సభ్యులు దర్మారెడ్డి,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వామపక్షాలకు చెందిన తుమ్మల వీరారెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios