కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వస్థలాలకు వెళ్లే దారి లేకపోవడంతో కాలినడకనే ఇళ్లకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని మంత్రి హరీశ్ రావు గురువారం పరామర్శించారు.

లాక్ డౌన్ పూర్తయ్యాక తన వాహనం ఇచ్చి మధ్యప్రదేశ్‌కు పంపిస్తానని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి రామాయంపేట మీదుగా దాదాపు 10 మంది కుటుంబీకులు కలిసి గత నాలుగు రోజులుగా కాలినడకన మధ్యప్రదేశ్ కు బయలుదేరారు.  

Also Read:కొండపోచమ్మ సాగర్‌కు నీటి తరలింపుకు లిప్ట్‌లు సిద్దం చేయాలి: కేసీఆర్

వీరిలో ఒకరైన సుస్మిత గర్భిణీగా ఉండగా, ఆమెకు వైద్య చికిత్స అవసరమైన విషయాన్ని తెలుసుకున్న హరీశ్ రావు అన్నీ రకాలుగా చూసుకుంటామని, వారిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ లాక్‌డౌన్‌లో  పైగా ఎండలో కాలినడకన వెళ్లడం మంచిది కాదని, మీకు అన్నం పెట్టిస్తా, కావాల్సిన పని ఇప్పిస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ సీఎంవో కార్యాలయం నుంచి మిమ్మల్ని బాగా చూసుకోవాలని, తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.

Also Read:లాక్‌డౌన్ పాసుల జారీలో రూల్స్ బ్రేక్: మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణపై వేటు

లాక్‌డౌన్ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లొద్దని తమకు సహకరించాలని, ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే తన ఫోన్ 9866199999 నెంబరుకు ఫోన్ చేయాలని మంత్రి కోరారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని హరీశ్ చెప్పారు.