కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారని అన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాడారని అన్నారు. ఆయన అమిత్ షా కాదని.. అబద్దాల బాద్ షా అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానేమో అబద్ధాలకు అడ్డగా, అమిత్ షానేమో అబద్ధాలకు బాద్ షాగా నిరూపించుకున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షాకు అల్జీమర్స్ వ్యాధి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని చెప్పారు. ఇవ్వని నిధులు ఇచ్చామని, అమలు కాని పథకాలను అమలు చేస్తున్నామని.. అమిత్ షా పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూసిందన్నారు. అందుకే వడ్ల కొనబోమని బీజేపీ తొండాట ఆడిందని విమర్శించారు. రూ. 3 వేల కోట్ల నష్టాన్ని భరించి కేసీఆర్ వడ్లు కొంటున్నారని చెప్పారు. రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని కోరారు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని విమర్శించారు.
బీజేపీ సభ అట్టర్ ఫ్లాప్ అని.. జనం నుంచి స్పందన లేదని విమర్శించారు. బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతికత ఉందా అని ప్రశ్నించారు. బీజేపీలో సీఎం కావాలంటే రూ. 2500 కోట్లు లంచం ఇవ్వాలని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేనే చెప్పారని అన్నారు. అబద్దాల బాద్‌షా మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ పోరాటల గడ్డ అని.. అమిత్ షా మాటలు నమ్మడాని గుజరాత్ కాదని అన్నారు. అమిత్ షాత తన ప్రసంగంలో తెలగాణ ప్రజల మీద, టీఆర్ఎస్ మీద అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు.
అమిత్ షా చెప్పిన ఆరు అబద్దాలను తాను ఎత్తిచూపుతున్నానని చెప్పారు. అబద్ధాలపై స్థానిక బీజేపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అడుగుతన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 1. ఆర్టికల్ 370 విషయంలో టీఆర్ఎస్ పార్లమెంట్‌లో మద్దతిచ్చిందని, ఓటు వేసిందని అన్నారు. 2. మిషన్ భగీరథకు రూ. 2,500 కోట్లు ఇచ్చారని చెప్పారు.. కానీ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. 3. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని అన్నారనీ.. తెలంగాణ ఆయుష్మాన్ భారత్ అమలు అవుతుందని కేంద్ర మంత్రే పార్లమెంట్‌లో చెప్పారని గుర్తుచేశారు. 4. సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతులు కట్టడం లేదని చెప్పారు.. కానీ అద్భుతంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణం జరుగుతుందన్నారు. తెలంగాణ సర్కార్ రూ. 2,679 కోట్లు మంజూరు చేసి, టెండర్లు పిలిచి పనులు చేస్తుందన్నారు.
5. మన ఊరు- మన బడి పైసలు కేంద్రానివే అని చెబుతున్నారు.. కానీ తెలంగాణ సర్కార్ రూ. 7,300 కోట్లు ఖర్చుపెడితే.. సర్వ శిక్ష అభియాన్‌లో వచ్చింది రూ. 300 కోట్లు మాత్రమేనని అన్నారు. 6. కేంద్ర మంత్రుల అబద్దాలు వేదికపైనే బయటపడ్డాయని హరీష్ రావు అన్నారు. ఈజీఎస్‌కు కేంద్రం రూ. 30 వేల కోట్లు ఇస్తుందని కిషన్ రెడ్డి చెబితే.. అర్ద గంటకే రూ. 18 వేల కోట్లు ఇస్తుందని అమిత్ షా అదే వేదికపై చెప్పారని ఎద్దేవా చేశారు.
