రైతుల మార్కెట్ వ్యవస్థను దెబ్బతీసేలా కేంద్ర వ్యవసాయ చట్టం ఉందన్నారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హారీశ్ రావు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, ఏ రాష్ట్రంలోనైనా ఉచిత కరెంట్ ఇస్తోందా అని మంత్రి ప్రశ్నించారు.

ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పమని ఆయన సవాల్ విసిరారు. రైతుల బావులకు మీటర్లు పెడితేనే రాష్ట్రాలు కేంద్రం నిధులిస్తామంటోందని హరీశ్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎవరి లాభం కోసం విదేశీ మక్కలు దిగుమతి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని నిలదీశారు.

అంతకుముందు ఎక్స్‌పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీ వల్ల రైతులకు నష్టం కలుగుతుందన్నారు హరీశ్ రావు. ఆఫ్రికా దేశాల నుంచి కందులు కొంటే మన రైతుల పరిస్థితి ఏంటని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఇక్కడి రైతులకు లాభం జరగాలంటే, మంచి ధర రావాలంటే కేంద్రం కందులను దిగుమతి చేసుకోవడం నిలిపివేయాలని ఆయన కోరారు.

ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధర పెరిగితే ఎగుమతులను నిలిపివేస్తారని... ఇది సరికాదని హరీశ్ అన్నారు. మధ్య తరగతి ప్రజానీకానికి సాయం చేయాలంటే రైతు వద్ద కొని రాయితీతో అందజేయాలన్నారు.

పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని.. అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో పత్తి ధర పెరిగితే అది సీసీఐకి లాభమని, కానీ రైతుకు మాత్రం ఏ లాభం జరగడం లేదన్నారు. లాభాలను రైతులకు పంచాల్సిన బాధ్యత సీసీఐ, కేంద్ర ప్రభుత్వంపైనా ఉందన్నారు.