తూఫ్రాన్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని స్పందించారు... మన ప్రధానికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. భారత్ బంద్ లో భాగంగా మంగళవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా తూఫ్రాన్ లో నిర్వహించిన రైతుల ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు 13 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  మన ప్రధానితో పాటు బీజేపీ నేతలు  ఎవరూ ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

పండించిన పంటకు మద్దతు ధర రాకుండా బీజేపీ పంగనామాలు పెడుతోందన్నారు.కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తే.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తోందని  హరీష్ రావు చెప్పారు.

also read:తలుపులు మూసి వ్యవసాయ చట్టాలను ఆమోదించుకొన్నారు: బీజేపీపై కేటీఆర్

రైతుల ఉసురు తగిలి బీజేపీ ప్రభుత్వం కొట్టుకుపోతోందని  ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రైతులకు నష్టం చేసే ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

కొత్త చట్టంతో రైతులు ఎక్కడికైనా వెళ్లి పంటలు విక్రయించుకోవచ్చు... కానీ మన రైతులు ఢిల్లీకి వెళ్లి పంటను విక్రయించుకొనే శక్తి ఉందా అని ఆయన ప్రశ్నించారు.

రైతులకు తమ ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.