Asianet News TeluguAsianet News Telugu

అవయవదానంలో దేశానికే తెలంగాణ ఆదర్శం: ఆర్గాన్ డోనర్స్‌ను సన్మానించిన మంత్రి హరీష్ రావు

నేషనల్  ఆర్గాన్  దినోత్సవాన్ని  పురస్కరించుకొని  అవయవాలు దానం చేసిన  వారిని  మంత్రి హరీష్ రావు ఇవాళ  సన్మానించారు. అవయవదానంలో  తెలంగాణ సర్కార్  విధానాలు దేశానికి  ఆదర్శంగా  నిలిచాయన్నారు. 

Telangana Minister  Harish Rao felicitates family members of organ donors
Author
First Published Nov 27, 2022, 2:54 PM IST


హైదరాబాద్:అవయవదానంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని  తెలంగాణ  రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  హరీష్ రావు చెప్పారు. అవయవదానం పారదర్శకంగా  జరిగేలా  తెలంగాణ ప్రభుత్వం  ఆన్ లైన్  పోర్టల్ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  ఇదే  పద్దతిని  కేంద్ర ప్రభుత్వంతో  పాటు  ఏపీ, కేరళ, గుజరాత్ , ఒడిశా, కర్ణాటక  రాష్ట్రాలు  అనుసరిస్తున్నాయన్నారు.

 నేషనల్‌ ఆర్గన్‌ డొనేషన్‌ డే  సందర్బంగా ఆదివారంనాడు  హైద్రాబాద్  లో  ఆవయవాలను  దానం  చేసినవారిని  మంత్రి హరీష్  రావు సన్మానించారు.ఈ  సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన  ప్రసంగించారు. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం గొప్ప విషయంగా  ఆయన పేర్కొన్నారు. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమని  హరీష్  రావు  చెప్పారు. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నానన్నారు.  అవయవదానంతో  ఎంతో మందికి  పునర్జన్మ  దక్కుతుందని  మంత్రి  చెప్పారు. . 

తన వద్దకు ప్రతిరోజూ ఒకరిద్దరూ వచ్చి జీవన్ దాన్ లో రిజిష్టర్ చేసుకున్నట్టుగా  చెబుతారన్నారు.  త్వరగా తమకు అవయవాలు ఇప్పించేలా చూడాలని కోరుతారన్నారు. ఈ విషయంలో తాను నిస్సహాయుడనని  హరీష్  రావు  తెలిపారు.  సీనియార్టీ ప్రకారం  అవయవాలను దానం చేస్తారని  హరీష్  రావు  తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి చికిత్స లేదా ఆర్థిక సాయం చేయగలనని  మంత్రి హరీష్ రావు  చెప్పారు. కానీ, అవయవాలు అవసరం ఉన్న వారికి సకాలంలో అవయవాలు అందించలేకపోతున్నట్టుగా తెలిపారు. 

మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, దూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల రోగాల బారినపడే  వారి సంఖ్య  పెరుగుతుందన్నారు. చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని చెప్పారు మంత్రి. 

అవగాహన లేమి, నిర్లక్ష్యం కారణంగా రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే  రోగాలు  ముదిరి  అవయవాలపై  ప్రభావం  పడదని  మంత్రి  చెప్పారు. బీపీ, షుగర్‌ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలంలో కిడ్నీలు, కాలేయం, కంటి సమస్యలు ఎదురై ఆర్గాన్స్‌ ఫెయిల్ అవుతున్నాయన్నారు మంత్రి  హరీష్ రావు. 

వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా  కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేమన్నారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి గుండెతోపాటు  పలు  కీలకమైన  అవయవాలను  దానం  చేయవచ్చని  మంత్రి తెలిపారు. ఈ రకమైన  అవయవాలతో  ఎనిమిది  మందికి ప్రాణం పోయవచ్చని  మంత్రి  వివరించారు.

జీవన్ దాన్ లో  36  ప్రభుత్వాసుపత్రులు  రిజిస్టర్  చేసుకున్నట్టుగా  మంత్రి  తెలిపారు. నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్లు జరుగుతున్నాయన్నారు.  2013 జీవన్‌దాన్‌ కార్యక్రమం ప్రారంభమైందన్నారు.  ఇప్పటి వరకు  4316 ఆర్గాన్స్‌ సేకరించి అవసరం ఉన్న వారికి అమర్చినట్టుగా  మమంత్రి  తెలిపారు. ఆర్గాన్‌ డొనేషన్‌ రేటు దేశంలో ప్రతి పది లక్షల మందికి 0.6శాతం ఉంటే తెలంగాణలో 5.08 శాతంగా ఉందని  మంత్రి  హరీష్  రావు  చెప్పారు.ఈ ఏడాది ఇప్పటి వరకు 179 ఆర్గాన్‌ డొనేషన్లతో తెలంగాణ దేశంలోనే ఉన్నత స్థానంలో ఉందన్నారు మంత్రి.  నిమ్స్‌ 351, ఉస్మానియాలో 71, గాంధీలో 11 మొత్తం 433 ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ శస్త్రచికిత్సలు  జరిగినట్టుగా  మంత్రి  వివరించారు.  

రూ. 10 లక్షల విలువ చేసే ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను పేదలకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందిస్తుందని మంత్రి  హరీష్  రావు  తెలిపారు.  గాంధీ ఆసుపత్రిలో కూడా రూ. 35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా  మంత్రి  చెప్పారు.  అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం పోయాలని మంత్రి  కోరారు. బిపి షుగర్ లును గుర్తించి తగిన వైద్యం తీసుకోవాలని  మంత్రి  సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios