కేంద్ర ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం వందరెట్లు మెరుగైందన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మోసాలు చేసే హాస్పిటళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ హెచ్చరించారు.

ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ చికిత్సకు నిరాకరిస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పేదలకు ఉచిత, నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తామని మంత్రి ఈటల అన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌పై మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వాస్పత్రుల్ని బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలన్నారు.

కాగా, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,103 పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. అయితే ఇప్పటికే కరోనాబారిన పడినవారిలో 2,243 మంది కోలుకున్నారని వెల్లడించారు.

తాజాగా నిర్దారణ అయిన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,91,386 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇందులో 1,60,933 మంది ఇప్పటికే ఈ వైరస్ బారినుండి సురక్షితంగా బయటపడ్డారు.

దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య  29,326 గా వుంది. ఇక గత 24గంటల్లో కరోనా కారణంగా 11మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1127కు చేరింది.

అలాగే జాతీయస్థాయి మరణాలు రేటు 1.56శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 0.58శాతంగా వున్నట్లు వెల్లడించారు. రికవరీ రేటు జాతీయస్థాయిలో 83.27శాతంగా వుంటే రాష్ట్రంలో అది ఏకంగా 84.08శాతంగా వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.