తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.

శుక్రవారం వరంగల్ ఎంజీఎంలో మృతదేహాలను  పరామర్శించిన ఎర్రబెల్లి , మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టామ‌ని, నిజానిజాలు తెలిశాక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పష్టం చేశారు.

Also Read:బావిలో 9 శవాల కేసులో ట్విస్ట్: మక్సూద్ కూతురితో బీహారీల లింక్స్?

మృతుల కుటుంబాలు కోరుకున్న విధంగా ఇక్క‌డే అంతిమ క్రియ‌లు చేయ‌డం కానీ, కావాలంటే వారి వారి సొంతూళ్ళ‌కు పంపడం కానీ చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. మృతుల‌లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన ప‌శ్చిమ‌బెంగాల్ వారు కాగా, ఇద్ద‌రు బీహార్ కార్మికులు, మ‌రో వ్య‌క్తి త్రిపుర‌కు చెందిన వ‌ల‌స కార్మికుడిగా గుర్తించారన్నారు.

వీళ్ళంతా కేవ‌లం వ‌ల‌స కూలీలు మాత్ర‌మే కాదని, చాలా ఏళ్లుగా గొర్రెకుంట పరిసరాల్లోనే ఉంటున్నారని మంత్రి తెలిపారు. వీరి మరణానికి కారణాలు విచారణలో తెలుస్తాయని... ఆ వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఎర్రబెల్లి వెల్లడించారు.

Also Read:గొర్రెకుంట బావిలో 9 మృతదేహాల ఘటనపై 9 టీములతో దర్యాప్తు: సీపీ రవీందర్

కొన్ని మృతదేహాలకు సంబంధించిన వారెవరూ లేరన్న ఆయన.. అన్ని విధాలుగా వారిని ఆదుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారని మంత్రి వివరించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు విచార‌క‌ర‌మ‌ని, కూలీలు, వ‌ల‌స కూలీల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం ముందుంద‌న్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని దయాకర్ రావు స్పష్టం చేశారు.