మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థులు మృతి
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మెడికోలు చనిపోయారు (Telangana MBBS students killed in road accident in Maharashtra). వీరిద్దరూ ఆదిలాబాద్ రిమ్స్ (RIMS)లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఘటనతో రిమ్స్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు మరణించారు. వీరిద్దరూ ఆదిలాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటనతో రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన డేవిడ్ రాజ్ (23), విజయవాడకు చెందిన బాలసాయి (24) మరో నలుగురితో కలిసి ఆదివారం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని యవత్ మాల్ జిల్లాలోని పాండ్రకవడకు వెళ్లారు. ఇది ఆదిలాబాద్ నుంచి దాదాపు 45 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆదివారం కావడంతో భోజనం చేసేందుకు వెళ్తామని మెడికల్ కాలేజీ అధికారులకు చెప్పి బయలుదేరారు.
మొత్తంగా ఆరుగురు మెడికోలు రెండు బైక్ లపై రాత్రి సమయంలో బయలుదేరారు. అర్థరాత్రి ప్రాంతంలో ఓ బైక్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో దానిపై ఉన్న డేవిడ్ రాజ్, బాలసాయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, మెడికల్ కాలేజీ డాక్టర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పాండ్రకవడ గవర్నమెంట్ హాస్పిటల్ లో మృతదేహాలను భద్రపరిచారు. ఈ ప్రమాదంపై బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సాయంత్రానికి మృతదేహాలను విద్యార్థుల స్వస్థలాలకు తరలించనున్నారు. విద్యార్థుల పాండ్రకవడకు వెళ్లేందుకు కచ్చితమైన కారణం, ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు మరణించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఓ కారులో కేరళలోని శబరిమలకు వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అదే కారులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ వాహనం ఆదివారం మధ్యాహ్నం సమయంలో తమిళనాడులోని మద్రాస్ బైపాస్ రోడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు అక్కడికక్కడే మరణించారు. వీరిని సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో కమలాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.