కామారెడ్డి:ఒక ఫ్యాన్ మూడు బల్బులు ఉన్న ఇంటికి రూ. 7 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఇంటి యజమాని షాక్‌కు గురయ్యాడు. పొరపాటున ఈ బిల్లు వచ్చి ఉంటుందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు.

also read:30 రోజులకే కరెంట్ రీడింగ్,మొబైల్‌కు బిల్లులు: టీఎస్‌ఎస్ పీడీసీఎల్

కామారెడ్డి జిల్లాలోని ఇస్రోజీవాడకు చెందిన  శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ. 7 లక్షల కరెంట్ బిల్లు రావడంతో ఆయన ఆ బిల్లు పట్టుకొని విద్యుత్ శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఫిబ్రవరి మాసంలో శ్రీనివాస్ రూ.414 విద్యుత్ బిల్లు చెల్లించారు. కానీ, ఈ మాసంలో ఏకంగా రూ. 7 లక్షల బిల్లు ఎలా వచ్చిందనే విషయమై ఆయన ప్రశ్నిస్తున్నారు.

also read:2019 మే కరెంట్ బిల్లునే ఈ నెలలో చెల్లించండి: టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ

లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే మాసాల్లో గృహ వినియోగదారులకు మీటర్ రీడింగ్ తీయలేదు. జూన్ మొదటివారంలో మీటరు రీడింగ్ తీశారు. ఏప్రిల్, మే మాసాల బిల్లులను గత ఏడాది ఏప్రిల్, మే మాసాల బిల్లుల ప్రకారం చెల్లించాలని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్రకటించింది.ఈ రెండు మాసాల పాటు విద్యుత్ బిల్లులను మూడో నెలలో అడ్జెస్ట్ చేశారు.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎక్కువ విద్యుత్ బిల్లులు వచ్చాయని స్ధానికులు ఫిర్యాదులు చేశారు. తమకు ఎందుకు ఎక్కువ బిల్లులు వచ్చాయని వినియోగదారులు ప్రశ్నించారు. ఎక్కువ బిల్లులు వస్తే వాటిని సరి చేస్తామని అధికారులు ప్రకటించారు.