Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ 'మహంకాళీ' బంగారు బోనం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారికి  హైదరాబాద్ చెందిన భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ కమిటీ బంగారు బోనం సమర్పించింది. 
 

Telangana Mahankali Bangaru Bonam Offered for Bejawada Goddess Kanaka Durga KRJ
Author
First Published Jul 3, 2023, 2:11 AM IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాడ మాసం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కనక దుర్గమ్మను దర్శించుకుని, తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఈ తరుణంలో ఆదివారం నాడు హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ కమిటీ కనకదుర్గ అమ్మవారికి  బంగారు బోనం సమర్పించింది. ఈ అనవాయితీ గత 14 సంవత్సరాలుగా కొనసాగుతోంది.

మహంకాళీ జాతర బోనాల ఉత్సవ కమిటీకి  ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, తెలంగాణా బొనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొన్నారు. 

తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, బేతాళ నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు తెలంగాణా బోనాల మహాంకాళి కమిటీ అమ్మవారికి బోనం  సమర్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ట్రస్ట్ బోర్డు చైర్మన్  కార్యనిర్వాహణాధికారి  అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు అందజేశారు. ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, పాలకమండలి సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, నంబూరి రవి, చింకా శ్రీనివాసులు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీ కృష్ణ, తొత్తడి వేదకుమారి,  భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర కమిటీ అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజు, సభ్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పి. చంద్రశేఖర్, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios