Asianet News TeluguAsianet News Telugu

ఇకపై మరింత కఠినం... రోడ్లపైకి వస్తే అంతే సంగతి...: హైదరాబాద్ సిపి వార్నింగ్

రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో పోలీసులు మరింత కట్టుదిట్టంగా కరోనా నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. 

telangana lockdown...  hyderabad police commissioner warning to people akp
Author
Hyderabad, First Published May 21, 2021, 3:20 PM IST

హైద‌రాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ ను పొడిగించిన కేసీఆర్ సర్కార్... నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత కట్టుదిట్టంగా కరోనా నిబంధనలు అమలు చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. దీంతో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోకి ప్రజలకు సిపి అంజనీ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇవాళ(శుక్రవారం) దిల్‌సుఖ్‌న‌గ‌ర్ తనిఖీ కేంద్రాన్ని సిపి అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్ర‌జ‌లంతా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని సూచించారు. అత్యవసరం అయితేనే ఇంట్లోంచి బయటకు రావాలన్నారు. అలా కాదని అనవసరంగా బయటకు వస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. 

హైదరాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మొత్తం 180 త‌నిఖీ కేంద్రాలు ఉన్నాయ‌ని తెలిపారు. లాక్‌డౌన్‌ నుండి మిన‌హాయింపులు ఉన్న‌వారికి మాత్రమే రోడ్ల‌పై తిర‌గ‌డానికి అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొన్నారు. త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్ల‌పై తిరిగితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌నాల‌ను సీజ్ చేస్తామ‌ని సిపి అంజనీ కుమార్ హెచ్చరించారు. 

ఇటీవలే తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నివారణపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైసేషన్ తదితర కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. కోవిడ్ రెండవ విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున దీని నివారణకు మరోసారి పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 

స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహాకారాలతో కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేసుకోవడం, మాస్క్ లను ధరించడం తదితర నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios