Telangana : తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. వచ్చే అక్టోబర్, నవంబర్ నెలల్లో గ్రామాల పాలనకు సంబంధించిన ఎన్నికలను పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Telangana : తెలంగాణ ప్రజలు ఎప్పెడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ సిద్దమయ్యింది. బిసి రిజర్వేషన్ పెంపుతో పాటు వివిధ కారణాలతో ఆలస్యం అవుతూవచ్చిన ఈ ఎన్నికలను త్వరలోనే నిర్వహించనున్నట్లు ఈసి ప్రకటించింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్దంచేసింది ప్రభుత్వం... దీంతో దసరా తర్వాత అంటే అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసి తెలిపింది. ఈమేరకు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు.
మొదట జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి ఆ తర్వాత గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం ఐదు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసి తెలిపింది... ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.
ముందుగానే అంతా సిద్దం చేసుకుని కేవలం 15 రోజుల్లోనే ఈ ఎంపిటీసి, జడ్పిటిసి ఎన్నికలు… మరో పదిహేను ఇరవై రోజుల్లో పంచాయితీ ఎన్నికలు పూర్తిచేయనున్నట్లు ఈసి తెలిపింది. ఇలా కేవలం నెల నెలన్నర రోజుల్లోనే రాష్ట్రంలోని గ్రామాలన్నింటిలో ఈ రెండు ఎన్నికలను పూర్తిచేయాలనేది ఈసి ఆలోచనగా తెలుస్తోంది.
అక్టోబర్ 9 నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి :
అక్టోబర్ 9 నుండి 17 వరకు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని ఈసి ప్రకటించింది. మొత్తం రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.
మొదటి విడత : అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల... ఆ రోజు నుండే మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న స్థానాలకు నామినేషన్లు దాఖలు ప్రారంభం - అక్టోబర్ 23న పోలింగ్
రెండో విడత : అక్టోబర్ 13 న నామినేషన్లు - అక్టోబర్ 27న పోలింగ్
పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ :
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగియగానే పంచాయితీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో రాష్ట్రంలోని పంచాయితీలన్నింటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన రోజే ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
ఇలా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు రెండు విడతల్లో... పంచాయితీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తిచేయనున్నట్లు ఈసి తెలిపింది. మొత్తంగా ఐదు విడతల్లో గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనుంది ప్రభుత్వం. నోటిఫికేషన్ వెలువడే అక్టోబర్ 9 నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
