Telangana Local Body Elections 2025 : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ఈ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోపై స్టే విధించిన హైకోర్టు.
Telangana Local Body Elections 2025 : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగించకుండా జీవో 9 పై స్టే విధించింది. దీంతో ఇప్పటికే విడుదలచేసిన ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా మారిపోబోతోంది... మొదటి విడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్డ్ ఆర్డర్ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానుంది.
బిసి రిజర్వేషన్ల పెంపు
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచింది... ఇందుకోసం జీవో 9 తీసుకువచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు 60 శాతానికి మించిపోయాయి... దీంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. కొందరు ఈ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు... గత రెండ్రోజులుగా ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం జీవో 9 పై మధ్యంతర స్టే విధించింది. దీంతో ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా…
తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్లు ఈ బిసి రిజర్వేషన్ల పెంపు వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పిటిషనర్లను ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది న్యాయస్థానం. అలాగే 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది న్యాయస్థానం. దీంతో ఎన్నికలు నెలరోజుల పాటు వాయిదాపడే అవకాశాలున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
