Telangana Local Body Elections 2025 : బిసి రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్ట్ స్టే విధించడంతో స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఈసి నుండి అధికారిక ప్రకటన వెలువడింది. 

Telangana Local Body Elections 2025 : తెలంగాణ స్ధానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మొదటివిడత ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గతనెల విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఈసి గెజిట్ జారీ చేసింది.

ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన ఈసి

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆప్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి) ఎత్తేయాలని ఈసీ ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రక్రియ ఈసీ తదుపరి ప్రకటన వరకు నిలిచిపోనుంది.

Scroll to load tweet…

ఎందుకు ఎన్నికలు నిలిచిపోయాయి?

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్ధల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను పెంచేందుకు జీవో 9 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచింది... దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతంకంటే ఎక్కువయ్యాయి. ఇది చట్టబద్దం కాదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం రిజర్వేషన్ల పెంపు జీవోపై మధ్యంతర స్టే విధించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రభుత్వం ఏం చేస్తుంది?

బిసి రిజర్వేషన్ల పెంపు జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్‌ ఇచ్చిన స్టేను వెకేట్‌ చేయించి ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక హైకోర్టులో ఈ వ్యవహారం తేలేవరకు ఎన్నికలను వాయిదా వేస్తుందా? లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారం మరో నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికలకు వెళుతుందా? అన్నది తేలాల్సి ఉంది.