Telangana Liberation Day 2025 : తెలంగాణలో బిజెపి సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకలు, కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం, బిఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా వేడుకలు జరుపుతున్నాయి.
Telangana Liberation Day 2025 : సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైన రోజు... ఎందుకంటే ఈ ప్రాంతం రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టింది ఈరోజునే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత అంటే 1948, సెప్టెంబర్ 17న తెలంగాణలో నిజాం రాజుల పాలన అంతమయ్యింది. ప్రజల సాయుధ పోరాటం, ఆర్మీ ఆపరేషన్ పోలో పలితంగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యింది. అందుకే ప్రతిఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు.
హైదరాబాద్ లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఈసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణను నిజాం పాలకుల నుండి విముక్తి కల్పించి దేశంలో విలీనం చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, సైనిక అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు కేంద్రమంత్రి. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు రాజ్ నాథ్ సింగ్.
కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించింది. అందుకే త్రివిద దళాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి... వీరి నుండి రక్షణమంత్రి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణలో పోటాపోటీగా సెప్టెంబర్ 17 వేడుకలు
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకమైనదే... కానీ రాజకీయ పార్టీలే ఒక్కో విధంగా ఈ వేడుకలను జరుపుతుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటే... మరో జాతీయ పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతోంది. ఇక తెలంగాణను గత పదేళ్లు పాలించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS) జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటోంది. ఇలా తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రజా పాలనా దినోత్సవం
సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటోంది... ఈ నేపథ్యంలో ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జాతీయ జెండా ను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
