Telangana Liberation Day 2023 : విమోచనమో, విలీనమో... తెలంగాణకు మాత్రం స్వాతంత్య్రం..!
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినమా లేక విలీన దినమా అన్న కన్ఫ్యూజన్ కు తెరదించుతూ 'తెలంగాణ సమైక్యతా దినం' గా నామకరణం చేసారు ముఖ్యమంత్రి కేసీఆర్.
హైదరాబాద్ : భారతదేశంతో బ్రిటీష్ పాలన 1947 ఆగస్ట్ 15న ముగిసింది. ఎందరో త్యాగధనుల పోరాటం, ప్రాణత్యాగాల పలితంగా దేశ ప్రజలకు స్వేచ్చా, స్వాతంత్రాలు లభించాయి. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్య్ర కాంక్ష నెరవేరలేదు. దేశ ప్రజలంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ ప్రజలు మాత్రం రాచరిక పాలనలో దాదాపు ఏడాదిపాటు మగ్గిపోయారు. చివరకు 1948 సెప్టెంబర్ 17 అంటే సరిగ్గా ఇదేరోజు తెలంగాణకూ స్వాతంత్య్రం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పోలీస్ యాక్షన్ కు తలొగ్గిన నిజాం నవాబు తెలంగాణను భారతదేశంలో విలీనం చేసాడు.
భారతదేశంలో బ్రిటీష్ అరాచకాల కంటే తెలంగాణలో నిజాం పాలనలో దొరలు, రజాకార్ల అరాచకాలు ఎక్కువగా వుండేవి. విదేశాల నుండి వచ్చిన తెల్లవాడు దేశ సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే... దొరలు, భూస్వాములు, రజాకార్లు తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకున్నారు. వీరి అరాచకాలను భరించలేకే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. నిజాం పాలన అంతం కోసం తెలంగాణ ప్రజలు కూడా ఓ స్వాతంత్య్ర పోరాటం చేసారన్నమాట.
హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని ఓ వైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు సాయుధ పోరాటంతో ప్రజలు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ నిజాం మాత్రం స్వాతంత్య్ర దేశంలో ఏడాదిపాటు పాలన సాగించాడు. చర్చలతో నిజాం నవాబు మాటవినకపోవడంతో భారత సైన్యం రంగంలోకి దిగింది. ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 'ఆపరేషన్ పోలో' చేపట్టి హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేసుకున్నారు.
దేశ నడిబొడ్డున గల హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 13న నాలుగువైపుల నుండి భారత సైన్యం చుట్టుముట్టింది. నిజాం సైనాన్ని సమర్ధవంతంగా ఎందుర్కొంటూ హైదరాబాద్ వైపు పయనిచింది. నాలుగువైపుల నుండి సైన్యం చుట్టుమట్టడంతో ఓటమిని అంగీకరించిన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17న లొంగుబాటు ప్రకటన చేసాడు. దీంతో తెలంగాణలో నిజాం పాలన ముగిసి ప్రజాస్వామ్య భారతంలో చేరింది.
విమోచనమా... విలీనమా?
అయితే తెలంగాణ భారతదేశంలో కలిసిన తర్వాత ఓ కొత్త వాదన తెరపైకి వచ్చింది. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది కాబట్టి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకోవాలని కొందరి వాదన. కాదు కాదు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ విలీనం అయ్యింది కాబట్టి విలీన దినంగా జరుపుకోవాలని మరికొందరి వాదన. ఈ విషయంలో బిజెపి వంటి పార్టీలు విమోచన దినోత్సవానికి... ఎంఐఎం తో పాటు మరికొన్ని పార్టీలు విలీన దినోత్సవంగా పేర్కొంటాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండింటిని కాదని కొత్త పేరును తెరపైకి తెచ్చి సంబరాలకు సిద్దమయ్యారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం...
తెలంగాణ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టి నేటి సెప్టెంబర్ 17కు 75 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో కేసీఆర్ సర్కార్ 'తెలంగాణ సమైక్యతా దినం' పేరిట ఉత్సవాలు చేపట్టింది. సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో ఈ వజ్రోత్సవ వేడుకలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇలా విలీనం, విమోచన దినోత్సవాల కన్ఫ్యూజన్ కు తెరదించుతూ సమైక్యతా దినంగా పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.