బిల్లులను ఆపడం ఏమిటీ?: గవర్నర్ పై శాసనమండలి చైర్మెన్ గుత్తా ఫైర్
అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ ఆపడాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పుబట్టారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
నల్గొండ: అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఏడు బిల్లులను గవర్నర్ ఆపడం ఏమిటని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.శుక్రవారంనాడు తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో మీడియాతో మాట్లాడారు. బిల్లులను ఆపితే అభివృద్ది ఎలా జరుగుతుందని సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఆయన విమర్శించారు.గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గవర్నర్ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.గవర్నర్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ చెప్పడంలో అర్ధం లేదన్నారు. గవర్నర్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీని రద్దు చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి కాకుండా అసెంబ్లీ ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దు విషయమై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం మొదలైందన్నారు. నిజాం ఆఖరి వారసుడి అంత్యక్రియలను కూడా రాజకీయం చేయడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజాం నవాబ్ ప్రజల కోసం అనేక మంచి పథకాలు చేపట్టిన విషయాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని తెరమీదికి తీసుకు వచ్చాయి.ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిరాకరించారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ ను నిరాకరించిందన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా గవర్నర్ చెబుతున్నారు. గవర్నర్ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రోటో కాల్ ను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.
also read:నేనెక్కడా లిమిట్స్ క్రాస్ చేయలేదు.. గవర్నర్లను కేసీఆర్ అవమానించారు : తమిళిసై సంచలన వ్యాఖ్యలు
గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై పౌందరరాజన్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అగాధం కొనసాగుతుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలో గవర్నర్ పై మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే కౌశికర్ రెడ్డికి గవర్నర్ ఈ ఫైలును తిప్పి పంపింది . దీంతో మరో కోటాలో కౌశిక్ రెడ్డికి ప్రభుత్వం ఎమ్మెల్సీని కేటాయించింది. అప్పటి నుండి ప్రభుత్వం, గవర్నర్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే.