లాక్ డౌన్ కాలంలో ప్రజాప్రతినిధులు ఆ నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘించిన సంఘటనలను మనం అనేకం చూసాము. రోజా తన మీద పూలు కురిపించుకోవడం నుండి నేతల బర్త్ డే పార్టీల వరకు అనేకం బయటకు వచ్చాయి. 

ఇలానే నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సైతం తన బర్త్ డే ను లాక్ డౌన్ కాలంలో నిర్వహించాడు. అందుకు సంబంధించిన విషయాలను V6 ఛానల్ రిపోర్టర్ పరమేశ్వర్ రిపోర్ట్ చేసాడు. మే 7వ తేదీన తాను ఆ ఎమ్మెల్యే 60 సంవత్సరాల పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలను రిపోర్ట్ చేయడం వలన నిర్మాణంలో ఉన్న తన ఇల్లును ఎమ్మెల్యే తన అధికార బలం ఉపయోగించి నేలమట్టం చేపించాడని ఆరోపించాడు. 

Also read: ఎమ్మెల్యే దౌర్జన్యం... వార్త రాసినందుకు ఇల్లు కూలగొట్టించాడు

వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే గారి బర్త్ డే వేడుకలను పరమేశ్వర్ రిపోర్ట్ చేయడంతో ఒక సామజిక కార్యకర్త ఇందుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసాడు. కోర్టు సదరు ఎమ్మెల్యే గారిని లాక్ డౌన్ కాలంలోఈ బర్త్ డే వేడుకలేమిటని ప్రశ్నించింది.  ఆయనకు నోటీసులను కూడా జారీ చేసింది. 

నోటీసులను జారీ చేసిన తెల్లారే నిర్మాణంలో ఉన్న సదరు జర్నలిస్టు ఇంటికి పర్మిషన్లు లేవనే కారణంతో ఆ నిర్మాణంలో ఉన్న ఇంటిని మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. 

ఎమ్మెల్యే తన అధికార బలంతోనే ఇలా చేపించాడని సదరు రిపోర్టర్ ఆరోపిస్తున్నాడు. మునిసిపల్ కమీషనర్ పై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఇలా పర్మిట్ లేదనే నెపంతో కూల్చేశారని అంటున్నాడు. 

మునిసిపల్ చట్టం ప్రకారం ఇలా అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేయొచ్చు. అందుకు మునిసిపల్ అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఇలా ఇంకెన్ని ఇల్లులు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ప్రశ్నకు సదరు మునిసిపల్ కమీషనర్ వద్ద సమాధానం లేకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు దారితీస్తుంది. 

సదరు రిపోర్టర్ సైతం తాను పర్మిషన్ తీసుకోలేదని, కానీ ఇలా అనేక మంది ఇళ్ల నిర్మాణాలకు అడ్డు చెప్పని మునిసిపల్ కమీషనర్ కేవలం తన ఇంటిని మాత్రమే కూల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. మిగిలిన వారెవ్వరి ఇండ్లను కూల్చనిది తన ఇంటిని మాత్రమే కూల్చడానికి.... మునిసిపల్ అధికారుల మీద ఎమ్మెల్యే తీసుకొచ్చిన ఒత్తిడే కారణమని వాపోతున్నాడు సదరు జర్నలిస్టు.  

ఈ మొత్తం వ్యవహారంతో తనకు సంబంధం లేదని, ఇలా నిర్మాణంలో ఉన్న ఇల్లును కూలగొట్టారు అన్న విషయం కూడా తనకు తెలియదని అన్నారు సదరు ఎమ్మెల్యే గారు. తాను అప్పుడు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని అన్నారు. 

ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సదరు రిపోర్టర్ ఈ విషయమై జర్నలిస్టు అస్సోసియేషన్లతో కలిసి మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యేపై అధికార పార్టీ చర్యలు తీసుకొని తనను ఇకమీదట ఇలా పర్సనల్ గా టార్గెట్ చేయకుండా ఉంటారని పరమేశ్వర్ ఆశిస్తున్నాడు.