ఏ నిర్ణయానికైనా సిద్ధం.. అవసరమైతే మా పార్టీని విలీనం చేస్తాం : కోదండరాం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని , తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా వున్నామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం లేదని.. తెలంగాణను వదిలి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం సరికాదన్నారు. రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని.. తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం టీజేఎస్‌తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ శక్తులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటామని.. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కోదండరాం వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.