పోలవరం ప్రాజెక్ట్ కారణంగా లక్ష ఎకరాల పంటతో పాటు భద్రాచలం, పర్ణశాల వంటి చారిత్రాత్మక ప్రదేశాలు సైతం మునిగిపోతాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రజత్ కుమార్.  

భద్రాచలం ముంపుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్ట్ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంతో లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయన్నారు. బ్యాక్ బాటర్‌తో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పని రజత్ కుమార్ హెచ్చరించారు. భద్రాచలం, పర్ణశాల వంటివి మునిగిపోతాయని ఆయన పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు నివేదించామని రజత్ కుమార్ గుర్తుచేశారు. బ్యాక్ వాటర్ నష్టం, ఇతర అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదన్నారు. ఈ మేరకు తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల తెలంగాణ‌లోని ప‌లు పాంత్రాలకు వరద ముంపు ఉందని.. వెంటనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేయ‌డంతో ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారు.

Also REad:ఆ మండలాల్ని ఇవ్వాలా.. భద్రాచలాన్ని అడుగుతాం ఇచ్చేస్తారా, పాత గొడవల్ని మళ్లీ లేపొద్దు: పువ్వాడకు అంబటి కౌంటర్

ఈ వ్యాఖ్యలకు ఆంధ్ర‌ప్రదేశ్ మంత్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి పువ్వాడ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్లో విలీనమైన పోలవరం ముంపు గ్రామాలకు ఏం చేయాలో తమ ప్ర‌భుత్వానికి తెలుసన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని మానుకోవాలని సూచించారు. ఆ ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామన్నారు. స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడం వల్ల.. హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, మ‌రి ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని ప్రశ్నించారు.

ఏదైనా స‌మ‌స్య ఉంటే.. చర్చించుకోవాలి, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి బోత్స కౌంట‌ర్ వేశారు. ముందుగా తన జిల్లా సంగతి చూసుకోవాలని సూచించారు. వందేళ్ల తర్వాత.. గోదావ‌రికి ఇంత వరద వచ్చిందన్నారు. ఈ విష‌యంలో ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలని, విలీన ప్రక్రియ కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు సరికాదని.. బాధ్యతగల పదవిలో వున్నవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదని అంబటి రాంబాబు హితవు పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు వున్నాయని... ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని మంత్రి గుర్తుచేశారు. కాఫర్ డ్యాం ఎత్తు పెంపునకు సీడబ్ల్యూసీ అనుమతి వుందని అంబటి రాంబాబు తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయని.. మా భద్రాచలం తిరిగి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా అని అంబటి ప్రశ్నించారు. ఎప్పుడో ముగిసిన అంశాలపై ఇప్పుడు వివాదం సరికాదన్నారు.